చేపలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
నాన్ వెజ్ వెరైటీలలో చేపలు కూడా ఒకటి. వీటిలో ఉత్తమ పోషకాలున్నాయి. ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండు సార్లు చేపలను తింటే ఎలాంటి గుండె జబ్బులు రావని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో తెలిసింది. చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం, అంతేకాదు ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి అందుతాయి.
చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బుద్ధిబలం పెరుగుతుంది
ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఎ తేలిగ్గా శరీరానికి అందుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. మానసిక ఆందోళనను పోగొడతాయి. చేపలను తరచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
పిల్లలకు ఆహారంగా చేపలను ఇస్తే వారిలో బుద్ధిబలం పెరుగుతుందని వైద్యులు తెలిపారు. వారానికి ఒకసారి చేపలు తిన్న 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో తెలివి బాగా పెరిగినట్లు పరిశోధనలో తేలినట్లు తెలిపారు. దీంతోబాటు వారి శరీరంలో కొవ్వు శాతం కూడా తగ్గినట్లు, ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా ఎదిగినట్లు పరిశోధనలో వెల్లడైనట్లు వారు వివరించారు.
No comments