టీవీలో చూపిస్తోన్న మాత్రలు వేసుకొమ్మని అంటున్నారు. అవి వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయంగా ఉంది. నా భయం నిజమేనా?
నా వయసు 42. మావారి వయసు 46. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే ఈ మధ్య నాకు శృంగారం మీద కాస్త ఆసక్తి తగ్గుతోంది. మావారు రోజూ కావాలంటారు కానీ నాకెందుకో కావాలనిపించడం లేదు. అలా అని శారీరకంగా ఏ ఇబ్బందీ లేదు. దాంతో మావారు కోరికలు పెరగడానికి టీవీలో చూపిస్తోన్న మాత్రలు వేసుకొమ్మని అంటున్నారు. అవి వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయంగా ఉంది. నా భయం నిజమేనా?
ఆడవారిలో ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి… నలభై సంవత్సరాలు దాటిన తర్వాత హార్మోన్లలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అండాశయాల పనితీరు మందగించడం వల్ల, దాని నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. ఆడవారిలో కోరికలను ప్రేరేపించేది ఈస్ట్రోజన్ హార్మోనే. అది తగ్గడం వల్ల కొందరికి సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుంది. అలాగే ఈ వయసులో పిల్లల బాధ్యతలు, వారి భవిష్యత్తును గురించిన ప్రణాళికల చుట్టూనే మనసు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా సెక్స్‌పై ఆసక్తి తగ్గుతుంది.
అలా అని కోరికలు పెరగడానికి సొంతగా మందులు వాడకూడదు. దానివల్ల దుష్ఫలితాలు కలగవచ్చు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఆ దుష్ఫలితాలు ఎక్కువగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి సమస్యను వివరించండి. మీకు ఆసక్తి తగ్గడానికి గల కారణాన్ని అన్వేషించి, హార్మోన్ ట్యాబ్లెట్లు, క్రీములు వంటివి ఇస్తారు. ( డా. వేనాటి శోభ )