కలయిక కోసం ప్రయత్నించినసారీ చాలా ఇబ్బంది వస్తోంది. అదేంటో నాకు తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
నా వయసు 20. పెళ్లై నెల కావస్తోంది. అయితే కలయిక కోసం ప్రయత్నించినసారీ చాలా ఇబ్బంది వస్తోంది. మావారి అంగం నా యోనిలోకి పూర్తిగా వెళ్లడం లేదు. కొంత దూరం వెళ్లి ఆగిపోతోంది. ఏదో అడ్డు తగులుతోంది, వెళ్లడం లేదు అంటున్నారు. లోపల వేలు పెట్టి చూసినా ఏదో తగులుతున్నట్టే అనిపిస్తోంది. అదేంటో నాకు తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
సాధారణంగా ఆడపిల్లల్లో యోని ద్వారం, హైమన్ ద్వారా కప్పబడి ఉంటుంది. దీనినే కన్నెపొర అంటాం. ఈ పొర కొందరిలో పలచ్చగా ఉండి, యోని రంధ్రం చుట్టూ ఉంటే… కొందరిలో మాత్రం సగం వరకే ఉంటుంది. కొందరిలో అయితే జల్లెడలా ఉంటుంది. మరికొందరిలో ఈ పొర యోని రంధ్రాన్ని పూర్తిగా మూసేసి ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. కొందరికి మాత్రం పొర బాగా మందంగా ఉంటుంది. పొర కనుక పలుచగా ఉంటే… మొదటి కలయిక సమయంలో అది చిరిగిపోయి, అంగం లోపలికి వెళ్లగలుగుతుంది.
అదే మందంగా ఉన్నట్లయితే… అంగాన్ని పూర్తిగా లోనికి వెళ్లనివ్వకుండా కలయికకు అడ్డు పడుతుంది. కొంతమందికి యోని లోపల అడ్డుగోడలా పొర (సెప్టమ్) ఉండవచ్చు. అలాంటప్పుడు దాన్ని కట్ చేసి తీసేస్తారు. మరి మీకు కన్నెపొర సమస్య వస్తోందో లేక వేరే ఏదైనా సమస్య ఉందా అన్నది పరీక్ష చేసి నిర్ధారించాలి. కాబట్టి మీరు ఓసారి డాక్టర్‌ను కలవండి. కారణాన్ని తెలుసుకుని దానికి తగిన చికిత్స చేస్తారు. ( డా. వేనాటి శోభ )