గర్భసంచిని శుభ్రం చేయాలి అని చెప్పారు. నేనిప్పుడు ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది? నా సమస్య తీరుతుందా?
నా వయసు 21. బరువు 36 కిలోలు. ఎత్తు 4-5 అడుగుల మధ్య ఉంటాను. నేనింత వరకూ మెచ్యూర్ కాలేదు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటాను. ఆకలి కూడా సరిగ్గా వేయదు. ఈ మధ్యే డాక్టర్ పరీక్ష చేసి… గర్భసంచి చిన్నగా ఉంది, టీబీ కూడా సోకింది, గర్భసంచిని శుభ్రం చేయాలి అని చెప్పారు. ట్యాబ్లెట్లు ఇస్తే వాడుతున్నాను. నేనిప్పుడు ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది? నా సమస్య తీరుతుందా?
మీరు చాలా తక్కువ బరువున్నారు. మీ ఎత్తుకి 40 నుంచి 45 కిలోల వరకు ఉండవచ్చు. ఆడపిల్లలు గరిష్టంగా పదహారేళ్ల లోపు రజస్వల అవ్వాలి. మీకు టీబీ సోకింది గర్భసంచికేనా లేక ఊపిరి తిత్తులకా? గర్భసంచి చిన్నగా ఉండటం లేదా దానికి టీబీ సోకడం వల్ల గర్భసంచి లోపలి పొర దెబ్బతిని మెచ్యూర్ కాకపోవచ్చు. ఒక్కోసారి జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా అలా జరగవచ్చు. కాబట్టి ఆ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో కూడా పరీక్ష చేయించుకుని, టీబీతో పాటు వాటికి కూడా ఆర్నెల్ల పాటు మందులు వాడండి.
పౌష్టికాహారం తీసుకుంటూ బరువు పెరగడానికి ప్రయత్నించండి. ఆరు నెలల తర్వాత మళ్లీ స్కానింగ్, రక్తపరీక్షలు చేసి… ఆ రిపోర్టును బట్టి ఇంకా ఎటువంటి చికిత్స తీసుకో వడం మంచిది అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. గర్భసంచి మరీ చిన్నగా ఉండి జన్యుపరమైన సమస్యలు కూడా ఉంటే కనుక ఎటువంటి చికిత్సా పని చేయదు. అండాశయాలు ఉన్నాయా, ఒకవేళ అవి కూడా చిన్నగా ఉన్నాయా అన్నది మీరు రాయలేదు. గర్భాశయంతో పాటు అండాశయాలు కూడా సరిగ్గా ఉంటేనే మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ( డా. వేనాటి శోభ )