నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా?
నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి పెళ్లయ్యాక చాలా ఇబ్బందులు వస్తాయని, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా? నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరానా?
కొంతమందికి నెలసరి సమయంలో ఎలాంటి సమస్యా లేకపోయినా కూడా నొప్పి వస్తుంది. ఆ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవడం వల్ల, బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయంలోని కండరాలు కుదించుకున్నట్లు అయ్యి… పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇవి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి వారిలో పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
వేరే ఏ సమస్యలూ లేనప్పుడు పిల్లలు పుట్టడంలోనూ సమస్యలు ఏర్పడవు. అయితే కొందరిలో మాత్రం గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, అడినోమయోసిస్ వంటి కొన్ని సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్‌తో పాటు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోండి. సమస్య ఏంటో తెలిశాక తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే కనుక, నొప్పి తగ్గడానికి పీరియడ్స్ సమయంలో రెండు నుంచి మూడు రోజులు మందులు వాడితే సరిపోతుంది. ( డా. వేనాటి శోభ)