రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి?

నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కలయిక సమయంలో అంగప్రవేశం జరిగినట్టు కూడా తెలియడం లేదు. మావారు కూడా విసుక్కుంటున్నారు. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి?
కొందరి శరీర తత్వాన్ని బట్టి… సాధారణ కాన్పు సమయంలో బిడ్డ బరువు, సైజును బట్టి యోని కండరాలు సాగి, బిడ్డను బయటకు నెట్టుతాయి. కొందరిలో మాత్రం యోని కింది భాగంలో కొద్దిగా కట్ చేసి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. కొందరికి కాన్పు తర్వాత యోని కండరాలు పూర్తిగా కాకపోయినా, చాలావరకు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొందరిలో, సాగిన యోని కండరాలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల యోని వదులవుతుంది.
మీకు కలయిక సమయంలో మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఓసారి గైనకాలజిస్టును కలవండి. పెరినియోరఫీ అనే ఆపరేషన్ ద్వారా కండరాలను దగ్గరగా లాగి కుట్టేస్తారు. తద్వారా యోని మళ్లీ బిగుతుగా అయిపోతుంది. ( డా. వేనాటి శోభ)