Header Ads

మావారికి ఆ సినిమాలు చూసే అలవాటు ఉంది

మావారికి ఆ సినిమాలు చూసే అలవాటు ఉంది

Image result for question answers
మావారికి ఆ సినిమాలు చూసే అలవాటు ఉంది - Sakshi
మావారికి ఆ సినిమాలు చూసే అలవాటు ఉంది

 నా వయసు 41. చాలా ఆరోగ్యంగా ఉంటాను. సాధారణంగా ఈ వయసులో వచ్చే ఇబ్బందులేవీ నాకింకా రాలేదు. దాంతో శృంగారంలో కూడా ఉత్సాహంగానే పాల్గొంటాను. మావారు కూడా చాలా యాక్టివ్. అయితే ఈ మధ్య నా యోని పొడిగా ఉందని ఆయన అంటున్నారు. నాక్కూడా కలయిక సమయంలో కాస్త మంటగా, పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తోంది. ఇదేమైనా అనారోగ్య సూచనా?

 - పద్మావతి, రాజవొమ్మంగి

 సాధారణంగా కలయిక సమయంలో ఆడవారు మానసికంగా, శారీరకంగా ఉత్తేజితం కావడం వల్ల వారి యోని నుంచి మ్యూకస్ ద్రవాలు ఊరతాయి. దాంతో కలయిక తేలికగా, నొప్పి లేకుండా జరుగుతుంది. కొందరిలో ప్రేరణ సరిగ్గా లేక ద్రవాలు ఊరవు. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల కూడా ఊరకపోవచ్చు. అలాంటప్పుడు యోని పొడిబారి, కలయికలో నొప్పి, మంట ఉంటాయి. కొందరికైతే యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అలా అవుతుంది. షుగర్ ఉన్నవారికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావొచ్చు. కాబట్టి ఓసారి డాక్టర్‌ని సంప్రదించి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకోండి. అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్‌లో లోపం ఉందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేక ఇతరత్రా ఏమైనా సమస్య ఉందా అని పరీక్షించుకోవడం మంచిది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ ఫంగల్ మాత్రలు, క్రీములు వాడితే చాలు. హార్మోన్ల లోపం ఉంటే ఈస్ట్రోజన్ క్రీము వాడాల్సి ఉంటుంది. ఏ లోపమూ లేకపోతే లూబ్రికేటింగ్ జెల్ వాడితే కలయిక తేలికగా జరుగుతుంది.

 

  నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. పిల్లలు అప్పుడే వద్దనుకున్నాం. నా సమస్య ఏమిటంటే... నాకెందుకో సెక్స్‌లో తృప్తి కలగడం లేదు. మావారి అంగం చాలా చిన్నగా ఉంటుంది. అందువల్లే అలా అనిపిస్తోందా? అంగం పెద్దది చేయడానికి ఏవైనా చికిత్సలు ఉంటాయా?

 - వీణ, అనంతపూర్

 మహిళలు సెక్స్‌లో తృప్తి పొందడానికి, మగవారి అంగం సైజుకి చాలావరకు సంబంధం ఉండదు. సాధారణంగా యోనిశీర్షాన్ని ప్రేరేపించడం ద్వారానే ఆడవాళ్లు సెక్స్‌లో తృప్తి పొందుతారు. అలాగే సెక్స్ ముందు ఫోర్‌ప్లే చేయడం వల్ల కూడా ప్రేరేపణ పొందుతారు. కొందరు మాత్రమే అంగం యోనిలోకి వెళ్లడం వల్ల తృప్తి పొందుతారు. ఆడవారి యోని 8 నుంచి 12 సెం.మీ. పొడవు ఉంటుంది. అందులో కింది భాగంలోనే కామాన్ని ప్రేరేపించే నాడులు ఉంటాయి. ఆ భాగాన్ని దాటి అంగం లోపలకు వెళ్లడం వల్ల ఆడవాళ్లకి ఎక్కువ తృప్తి ఏమీ కలగదు. సాధారణంగా మగవారి అంగం వెడల్పు 9 నుంచి 10 సెం.మీ. ఉంటుంది. అంగస్తంభనకు ముందు 7 నుంచి 10 సెం.మీ. ఉంటుంది. స్తంభించిన తర్వాత 12 నుంచి 16 సెం.మీ. పొడవు, 12 సెం.మీ. వెడల్పు అవుతుంది. కాబట్టి మీ మనసులోంచి అంగం చిన్నది అనే సందేహాన్ని ముందు పూర్తిగా తొలగించేయండి. మీ వారితో మనసు విప్పి మాట్లాడి, ఎక్కువ సమయం ఫోర్ ప్లేలో పాల్గొనండి. అలా కూడా శృంగారంలో ఎంతో తృప్తి లభిస్తుంది.

 

  ఉద్యోగరీత్యా నేను, మావారు వేర్వేరు చోట్ల ఉంటున్నాం. నెలకొకసారే కలుసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మాకు వీలు చిక్కేసరికి నాకు పీరియడ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మావారు కలయిక కోసం ఒత్తిడి చేస్తారు. ఆయన్ని బాధపెట్టడం ఇష్టం ఉండక నేను సరే అంటాను. కానీ ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం వేస్తూ ఉంటుంది. నెలసరి సమయంలో సెక్స్ చేయవచ్చా?

 - వాసంతి, మచిలీపట్నం

 పీరియడ్స్ సమయంలో కలయిక అనేది వారి వారి వ్యక్తిగత శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్‌ను బయటకు పంపడానికి అనువుగా గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరచుకుంటుంది. ఆ సమయంలో కనుక శారీరకంగా కలిస్తే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి గర్భాశంలోకి పాకే అవకాశం ఉంటుంది. అలాగే కొందరిలో బ్లీడింగ్‌లో వచ్చే గర్భాశయ పొరలో బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. అవి మగవారికి సోకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఆ సమయంలో దూరంగా ఉంటే మంచిదని అంటుంటారు. తప్పదు అనుకుంటే, మీకు ఇష్టమై కలవాలి అనుకుంటే కనుక కండోమ్ వాడటం ఉత్తమం.

 

  నా వయసు 21. నాకు గత కొంతకాలంగా సెక్స్ కోరికలు చాలా ఎక్కువయ్యాయి. దాంతో మా ఇంట్లో అద్దెకుండే వ్యక్తికి దగ్గరయ్యాను. అతని భార్య పురిటి కోసమని పుట్టింటికి వెళ్లింది. అప్పుడే మేమిద్దరం ఒక్కటయ్యాం. కొన్ని నెలలుగా శారీరకంగా కలుస్తున్నాం. అయితే ఈ మధ్య నాకు యోని చుట్టూ చెమట పొక్కుల మాదిరిగా వచ్చాయి. ఎందుకలా వచ్చాయో తెలియడం లేదు. అలాగే నాకీ నెల పీరియడ్స్ రాలేదు. గర్భం వచ్చిందేమోనని భయంగా ఉంది. అదే జరిగితే నేనేం చేయాలి? అసలు నాకు కోరికలు ఎక్కువగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే వాటిని తగ్గించుకునే మార్గం చెప్పండి.

 - సుజాత, పాల్వంచ

 సెక్స్ కోరికలు అందరికీ ఉంటాయి. ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుని, దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి. ఏదైనా పనిలో నిమగ్నమయి నప్పుడు ఆలోచనలు మారి, కోరికలు తగ్గుతాయి. అంతేతప్ప దానికంటూ ప్రత్యేక మార్గాలు ఏమీ లేవు. మీ కోరికలను గ్రహించి, అవతలి వ్యక్తి మిమ్మల్ని బాగా ఉపయోగించుకున్నాడు. వివాహేతర సంబంధాల వల్ల సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వాటితో పాటు ఇతరత్రా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా చట్టుముడతాయి. మీకు యోని చుట్టూ వచ్చిన పొక్కులు కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన వార్ట్స్ కావొచ్చు. లేదంటే ఏదైనా సుఖవ్యాధి అయినా కావచ్చు. ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి, త్వరగా చికిత్స చేయించుకోవడం మంచిది. నెల కూడా తప్పారు కాబట్టి గర్భం వచ్చిందేమో కూడా పరీక్ష చేయించుకోండి. తెలియక ఓసారి తప్పు చేస్తే ఫర్వాలేదు కానీ, తెలిశాక కూడా మళ్లీ మళ్లీ తప్పు చేయడం తెలివితక్కువ పని. దానివల్ల కష్టం, నష్టం మీకే. ఆ విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది.

 

  నేను గతంలో నా సగం లివర్‌ను మా అమ్మగారికి దానం చేశాను. తర్వాత ఆవిడ నాలుగేళ్లు జీవించి చనిపోయింది. ఇప్పుడు నా వయసు 19. నేను పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? కలయిక సమయంలో ఇబ్బందులు తలెత్తడం కానీ, పుట్టే పిల్లలకు లోపాలు ఏర్పడటం కానీ జరుగుతుందా? అసలు నేను వివాహం చేసుకోవచ్చా లేదా?

 - స్వాతి, ఏలూరు


 లివర్‌కి ఒక ప్రత్యేకత ఉంది. దానిలోని కణాలు వాటంతట అవే విభజన చెంది, కాలేయాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకు వస్తాయి. కాబట్టి మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మీరు పెళ్లి గురించి, శృంగారం గురించి, పిల్లల గురించి అనవసరంగా ఆలోచించి కంగారు పడాల్సిన పని లేదు. లివర్ డొనేషన్‌కి, మీ సందేహాలకు సంబంధమే లేదు. కాబట్టి మీరు వివాహం చేసుకుని, అందరిలానే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు.

 

  నా వయసు 18. నేనింతవరకూ మెచ్యూర్ కాలేదు. డాక్టర్లకు చూపించే స్తోమత లేక అమ్మానాన్నలు నన్నిలా వదిలేశారు. ఒకవేళ నేను వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? నాకు ఈ మధ్య ఎందుకో సెక్స్‌పై ఆసక్తి ఎక్కువవుతోంది. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని సుఖపడాలని అనిపిస్తోంది. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండే అవకాశం నాకు లేనే లేదా? రజస్వల కావాలంటే నేను ఏం చేయాలి?

 - బిందు, పెదపూడి

 మీరు మీ ఎత్తు, బరువు రాయలేదు. సాధారణంగా అమ్మాయిలు పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు... వారి వారి బరువు, హార్మోన్ల నిష్పత్తిని బట్టి రజస్వల అవుతారు. పద్దెనిమిదేళ్లు దాటినా మీరు రజస్వల కాలేదు అంటే కచ్చితంగా ఏదో సమస్య ఉండి ఉండవచ్చు. థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్ వంటి పలు హార్మోన్లలో లోపం... గర్భాశయం, అండాశయాలు లేకపోవడం లేదంటే వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యు పరమైన సమస్యలు, మరీ సన్నగా లేక లావుగా ఉండటం, గర్భాశయ టీబీ, యోనిభాగం మూసుకుపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా పదహారేళ్లు దాటిన తర్వాత కూడా మెచ్యూర్ కాకపోవడం జరుగుతుంది. మీకు పరిష్కారం చెప్పాలంటే ముందు మీలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దాన్నిబట్టి తగిన చికిత్స చేస్తే మీరు తప్పకుండా మెచ్యూర్ అవుతారు. అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. మీకు ఖర్చుపెట్టే స్తోమత లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉన్నాయి. అక్కడి గైనకాలజిస్టును సంప్రదిస్తే స్కానింగ్, రక్తపరీక్షల వంటివి ఉచితంగా చేస్తారు. కారణాన్ని బట్టి తగిన చికిత్స అందిస్తారు.


  నా వయసు 21. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. మావారికి బ్లూఫిల్మ్స్ చూసే అలవాటు ఉంది. ప్రతిరోజూ రాత్రి చూస్తూ ఉంటారు. నన్ను కూడా చూడమని బలవంతపెడుతుంటారు. ఎందుకు అంటే మూడ్ బాగా వస్తుంది అంటుంటారు. కానీ నాకెందుకో అవి చూడాలంటే సిగ్గుగా ఉంటుంది. ఉన్న కోరిక కూడా తగ్గిపోతుంది. ఆ విషయం చెప్పినా మావారు వినడం లేదు. నేనేం చేయాలి?

 - దీప, వరంగల్

 మూడ్ బాగా రావడానికి బ్లూఫిల్మ్స్ రోజూ చూడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా, ప్రేమగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మనసు బాగున్నప్పుడు మూడ్ దానంతటదే వస్తుంది. అంతే తప్ప ఏవేవో చూడటం వల్లే మూడ్ వచ్చి శృంగారంలో ఎంజాయ్ చేయగలం అనుకోవడం పూర్తిగా పొరపాటు. ఈ విషయాన్ని మీవారికి బాగా అర్థమయ్యేలా మీరే చెప్పండి.  అలాంటివి చూస్తే ఉన్న కోరిక కూడా తగ్గిపోతోంది అని నాకు చెప్పినట్టే మీ ఆయనకు కూడా చెప్పండి. అన్యోన్యంగా ఉండి ఆనందంగా ఎంజాయ్ చేయండి.


 పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్‌ను బయటకు పంపడానికి అనువుగా గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరచుకుంటుంది. ఆ సమయంలో కనుక శారీరకంగా కలిస్తే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే గర్భాశయంలోకి పాకే అవకాశం ఉంటుంది.

Post Top Ad

Post Bottom Ad