ఈ వయసులో ఏమిటి?
సందేహం
నా వయసు 18 సంత్సరాలు. నేను కొద్దికాలంగా రక్తహీనత (ఎనీమియా) సమస్యతో బాధపడుతున్నాను. ఈ వయసులో ఎనీమియా ఏమిటని తెలిసిన వాళ్లు ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఇది ఏ వయసులో మొదలవుతుంది? ఖరీదైన పదార్థాలు తీసుకోలేని ఆర్థికపరిస్థితి మాది. మాకు అందుబాటులో ఉన్న పదార్థాలు ఏమైనా ఉన్నాయా? దీనికి చికిత్స ఏమైనా ఉంటుందా? పెళ్లి తరువాత సమస్యలు వస్తాయా?
– సీఆర్, నాగారం, వరంగల్ జిల్లా.
రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటాన్ని ఎనీమియా అంటారు. ఇది ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషక పదార్థాల లోపం వల్ల, హీమోగ్లోబిన్ తయారీలో లోపాల వల్ల, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, కడుపులో నులిపురుగులు ఉండటం, బ్లీడింగ్ ఎక్కువవడం వంటి అనేక కారణాల వల్ల ఆడవారిలో ఎనీమియా ఏర్పడవచ్చు. ఎనీమియా రావడానికి వయసుతో సంబంధం లేదు. ఇది ఏ వయసులో వారికైనా రావచ్చు.
ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కారణాలను తెలుసుకోవడం మంచిది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. పోషక పదార్థాల లోపం వల్ల అయితే ఆహారంతో తాజా ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయలు, పప్పులు, పండ్లు, ఖర్జూరం, వేరుశెనగపప్పు, బెల్లం వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల హీమోగ్లోబిన్ పెరిగి చాలావరకు ఎనీమియా తగ్గుతుంది. కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే అల్బెండాజోల్–400 మి.గ్రా మాత్ర ఒకటి నోటి ద్వారా వేసుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు కొన్ని నెలల వ్యవధిలో ఈ మాత్ర మళ్లీ ఒకటి వేసుకోవచ్చు. ఎనీమియా తీవ్రత ఎక్కువగా ఉంటే పోషకాహారంతో పాటు ఐరన్ మాత్రలు, విటమిన్ బి12, విటమిన్ సి మాత్రలు వాడి చూడవచ్చు.
తీవ్రత మరీ ఎక్కువ ఉంటే ఐరన్ ఇంజెక్షన్లు క్రమంగా మూడు నాలుగు డోసులు చిన్న సెలైన్ బాటిల్ ద్వారా ఎక్కించుకోవచ్చు. అయినా మార్పు లేకపోతే, తప్పనిసరి అయితే రక్తం ఎక్కించుకోవలసి ఉంటుంది. పెళ్లయిన తర్వాత కూడా రక్తహీనత ఎక్కువగా ఉంటే పైన చెప్పిన చికిత్సలు తీసుకోవాలి. లేకపోతే నీరసం, ఒంటినొప్పులు, గర్భంలో ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్‌బో, హైదర్‌నగర్, హైదరాబాద్ .
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments