పెళ్లయ్యిందా... ఫిగర్ గురించి టెన్షన్ పడుతున్నారా...!
టీనేజీ అమ్మాయిలు తమ ఫిగర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడ లావైపోతారో, ఎక్కడ ఫిగర్ పాడైపోతుందోనని ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. మరి పెళ్లయ్యి, ఇళ్లలో ఉండే మహిళల సంగతేంటి? వాళ్లకి ఫిట్ నెస్ అవసరం లేదా? ఈ విషయం చాలామంది గృహిణులు ఆలోచించరు. కాస్త కేర్ తీసుకోవచ్చు కదా అంటే... ఎక్కడ కుదురుతుంది అనేస్తారు సింపుల్ గా. ఇంట్లో పనంతా చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తకి కావలసినవన్నీ సమకూర్చాలి, ఉదయం నుంచీ ఉరుకులు పరుగులతోనే సరిపోతుంటే ఇక అందంగా తయారయ్యే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటుంటారు. నిజానికి కేర్ తీసుకోమనేది అందం కోసం కాదు... ఆరోగ్యం కోసం. అవును. ఫిట్ నెస్ అనేది ఫిగర్ ని పర్ ఫెక్ట్ గా ఉంచుకోవడం కోసమే కాదు... ఫ్యూచర్ ని సంతోషంగా గడపడం కోసం. ఈ విషయం అర్థం కాని ఎంతోమంది గృహిణులు తమ ఒంటి మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆకర్షణ కోల్పోవడంతో పాటు అనారోగ్యాల బారిన కూడా పడుతుంటారు.
నిజానికి ఫిట్ గా ఉండటానికి పని గట్టుకుని జిమ్ లకి వెళ్లక్కర్లేదు. పనులన్నీ మానేసుకుని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల్లోనే చక్కని వ్యాయామం ఉండేలా చూసుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే అందాన్ని ఆనందాన్ని మన దగ్గర కట్టి పడేసుకోవచ్చు.
ముందుగా మీరు ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టండి. పనుల హడావుడిలో పడి ఏదో తినేశాంలే అనిపించకుండా ఓ క్రమ పద్ధతిలో తినడం అలవర్చుకోండి. మూడు నాలుగు గంటలకోసారి ఆహారం తీసుకోండి. వీలైనంత వరకూ ఆహారంలో గింజలు ఉండేలా చూసుకోండి. ప్రొటీన్లు ఎక్కువగా, చక్కెర తక్కవగా ఉండాలి. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. మసాలాలు, కారం, నూనె తగ్గించేయండి.
ఇక వ్యాయామం సంగతి. మీరు చేసే పనుల్లోనే వ్యాయామం ఉండేలా చూసుకోండి. మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక రోళ్లు పక్కన పెట్టేశాం. కానీ ఒక్కసారి మళ్లీ వాటిని వాడి చూడండి. చేతులకు ఎంత గొప్ప వ్యాయామమో తెలుస్తుంది. వీలైతే బట్టలు కూడా వాషింగ్ మెషీన్లో కాకుండా చేత్తోనే ఉతకండి. అపార్ట్ మెంట్లో ఉంటుంటే లిఫ్ట్ వాడకండి. మెట్లు ఎక్కి దిగండి. కూరగాయలకు, సరుకులకు మీవారినో పిల్లల్నో పంపకుండా మీరే వెళ్లి రండి. చిన్న చిన్న దూరాలకు కూడా ఆటోలు బస్సులు ఎక్కకుండా నడిచి వెళ్లండి. ఏ మధ్యాహ్నం పూటో టీవీ చూడాలని కూర్చుంటారు కదా! అప్పుడు రిమోట్ వాడకండి. చానెల్ మార్చుకోవాలనుకున్నప్పుడు టీవీ దగ్గరకు వెళ్లి వస్తూ ఉండండి. బైటికి వెళ్లినప్పుడు సెల్ వాడినా... ఇంట్లో వాడటానికి ఓ ల్యాండ్ లైన్ పెట్టించుకోండి. అది రింగయినప్పుడల్లా పరుగు పరుగున వెళ్లడం కంటే మంచి వ్యాయామం ఏముంటుంది!
ప్రపంచం ముందుకు వెళ్తుంటే మమ్మల్ని వెనక్కి వెళ్లమంటున్నారేంటి అనుకోకండి. మంచి జరుగుతుందనుకుంటే నాలుగడుగులు వెనక్కి వేయడంలో తప్పు లేదు. జిమ్ కి వెళ్లే సమయం, వ్యాయామం చేసే తీరిక లేనప్పుడు కనీసం లైఫ్ స్టయిల్ ని మార్చుకుంటే మేలు జరుగుతుంది. ఫిట్ నెస్ పెరుగుతుంది. అనారోగ్యం మీకు దూరంగా పరిగెడుతుంది. వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.
No comments