Header Ads

నా వయసు 39 సంవత్సరాలు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌. ఈ వయసులో... సమస్యలేనా......?

నా వయసు 39 సంవత్సరాలు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌. ఈ వయసులో పిల్లల్ని కనడం వల్ల ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’లాంటి లోపాలతో బిడ్డలు పుడతారని చదివాను. ఇది నిజమేనా? ఈ సిండ్రోమ్‌ లక్షణాలు ఏమిటి? ఇది రాకుండా ముందుజాగ్రత్తలు ఏమైనా తీసుకునే వీలుందా? – కె.ఊర్మిళ, అనంతపురం.


సాధారణంగా తండ్రి వీర్యకణం నుంచి 23 క్రోమోజోమ్‌లు, తల్లి అండం నుంచి 23 క్రోమోజోమ్‌లు కలిసి బిడ్డలో 23 జతల క్రోమోజోమ్‌లు (46 క్రోమోజోమ్‌లు) సంక్రమిస్తాయి. ఎన్నో తెలియని కారణాల వల్ల, కొందరిలో వీర్యకణం, అండం ఫలదీకరణ చెందే సమయంలో బిడ్డలోని 21వ క్రోమోజోమ్‌ వద్ద ఒక జత బదులు ఇంకో క్రోమోజోమ్‌ అదనంగా కలుస్తుంది. దీనినే ట్రైసోమి లేదా డౌన్స్‌ సిండ్రోమ్‌ అంటారు. తల్లి వయసు 35 సంవత్సరాలు దాటే కొద్దీ బిడ్డకు డౌన్స్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉన్న శిశువు ముఖ కవళికలు తేడాగా ఉండటం, ముక్కులో ఉండే ఎముక లేకుండా ఉండి ముక్కు చప్పిడిగా ఉంటుంది.

వీరిలో గుండెలో రంధ్రాలు, గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీలో వాపులు, మెదడు పనితీరు సరిగా లేకపోవడంతో మానసిక ఎదుగుదల లేకపోవడం, బుద్ధిమాంద్యం, వినికిడి లోపాలు వంటి అనేక సమస్యలతో బాధపడతారు. డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టిన పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికీ ఓర్పుగా పెంచుకోవలసి ఉంటుంది. ఇది రాకుండా మనం తీసుకునే జాగ్రత్తలు ఏమీ లేవు. కాకపోతే దీనిని ముందుగానే గుర్తించడానికి తల్లి గర్భంతో ఉన్నప్పుడు మూడో నెల చివరిలో ఎన్‌టీ స్కాన్‌తో పాటు డబుల్‌ మార్కర్‌ టెస్ట్‌ అనే రక్తపరీక్ష లేదా ఐదో నెలలో టిఫా స్కాన్‌తో పాటు క్వాడ్రుపుల్‌ టెస్ట్‌ చేయించుకోవడం వల్ల డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుస్తుంది.

ఈ పరీక్షల్లో ‘లో రిస్క్‌’ అని వస్తే డౌన్స్‌ సిండ్రోమ్‌ అవకాశాలు తక్కువగా ఉన్నట్లు, ‘హై రిస్క్‌’ అని వస్తే దీని అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిగణించాలి. డౌన్స్‌ సిండ్రోమ్‌ నిర్ధారణకు మూడో నెల చివర్లో కొరియానిక్‌ విలస్‌ బయాప్సీ, లేదా ఐదో నెలలో ఆమ్‌కియోసెంటిసిస్‌ అనే ఉమ్మనీటి పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. ఈ పరీక్షలు చేయించుకునేటప్పుడు వందలో ఒకరికి అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. డౌన్స్‌ సిండ్రోమ్‌ అంటూ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స అంటూ ఏమీ ఉండదు. ఇది ముందుగానే తెలుసుకోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల పెంపకం జీవితాంతం భారంగా భావించడం వల్ల అబార్షన్లు చేయించుకుంటారు. కొంతమంది ఎలా ఉన్నా బిడ్డను పెంచుకోవడానికి మానసికంగా సిద్ధపడి గర్భాన్ని ఉంచేసుకుంటారు.

నా వయసు 28 సంవత్సరాలు. బరువు 58 కిలోలు. నేను ప్రెగ్నెంట్‌. ఈ వయసులో ఆరోగ్యకరమైన బరువు అంటే ఎంత ఉండాలి? గర్భం చివరి దశలో ఎంత బరువు ఉంటే మంచిది? ఒకవేళ బరువు తక్కువైతే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా పెరగవచ్చు? – కె.రజిని, రామగుండం

మీ ఎత్తు ఎంతో రాయలేదు. ఎత్తుని బట్టి బరువు సరిగా ఉందా లేదా నిర్ణయించడం జరుగుతుంది. అంతేగాని వయసుని బట్టి కాదు. గర్భంతో ఉన్న తొమ్మిది నెలల్లో 11–15 కిలోల వరకు బరువు పెరగవచ్చు. మరీ బరువు ఎక్కువ ఉన్నవారు 6–9 కిలోల వరకు బరువు పెరగవచ్చు. బరువు మరీ తక్కువగా ఉన్నవారు 12–18 కిలోల వరకు పెరగవచ్చు. బరువు తక్కువ ఉన్నవారు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, పప్పులు, అన్నం లేదా చపాతీ, డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, మాంసాహారులైతే రోజూ ఒక గుడ్డు, వారానికి రెండు మూడుసార్లు మాంసం, వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవచ్చు.

సాధారణ బరువు ఉన్నవారికి నెలకు రెండు కిలోల వరకు పెరగవచ్చని చెప్పడం జరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు నెలకు 750 గ్రాముల నుంచి 1 కిలో వరకు పెరగవచ్చు. బరువు తక్కువగా ఉన్నవారు నెలకు 2.5 నుంచి 3 కిలోల వరకు పెరగవచ్చు. సాధారణ మహిళకు రోజుకి 1800–2000 కేలరీల శక్తి ఇచ్చే ఆహారం సరిపోతుంది. గర్భిణి సమయంలో మొదటి మూడు నెలల్లో అధిక కేలరీల అవసరం ఉండదు. నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు రోజుకు అదనంగా 300 కేలరీల ఆహారం అవసరమవుతుంది. అంటే ఈ 300 కేలరీలో రెండు గ్లాసుల పాలలో దొరుకుతుంది. ఏడో నెల నుంచి కాన్పు వరకు రోజుకు అదనంగా 500 కేలరీల ఆహారం అవసరమవుతుంది.

గర్భిణులలో విటమిన్‌ బి12 లోపం వల్ల సమస్యలు వస్తాయని విన్నాను. ఎలాంటి సమస్యలు వస్తాయి. దీని నివారణరకు ఏంచేయాలి? – డి.శైలజ, ఆత్మకూర్‌

గర్భిణులు విటమిన్‌ బి12 తీసుకోవడం వల్ల బిడ్డలో నాడీ వ్యవస్థ, డీఎన్‌ఏ సరిగా ఏర్పడి, మెదడు పనితీరు బాగుంటుంది. దీనివల్ల బిడ్డలో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉంటుంది. తల్లి రక్తంలో హీమోగ్లోబిన్, రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. దానివల్ల తల్లిలో రక్తహీనత లేకుండా ఉంటుంది. తల్లిలో బి12 లోపం ఉన్నప్పుడు బిడ్డ నాడీ వ్యవస్థలో, మెదడు ఎదుగుదలలో లోపాలు, బిడ్డ సరిగా ఎదగకపోవడం, అబార్షన్లు అవడం, బీపీ పెరిగే అవకాశాలు, రక్తహీనత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీని నివారణకు బి12 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. బీ12 పాల ఉత్పత్తులు, గుడ్డు, మాంసాహారంలో ఎక్కువగా దొరుకుతుంది. శాకాహారంలో బి12 లభించదు. జీర్ణవ్యవస్థ సరిగా ఉండే తిన్న ఆహారం నుంచి బి12 కేవలం 5 శాతం మాత్రమే రక్తంలోకి చేరుతుంది. శాకాహారులకైతే ఈ శాతం కూడా దొరకదు. కాబట్టి బి12 మాత్రలను తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఇది ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలలో కలిసి దొరుకుతుంది. కాబట్టి ఈ కలయిక ఉన్న మాత్రలను రోజూ తీసుకోవడం మంచిది.

No comments

Post Top Ad

Post Bottom Ad