కండోమ్ మాత్రమే కాదు.. ఈ పద్ధతులు కూడా అవాంఛిత గర్భం రాకుండా చేస్తాయి..
ఫ్యామిలీ ప్లానింగ్.. పెళ్లైన జంటలు అప్పుడే పిల్లలు వద్దనుకున్నప్పుడు పాటించే పద్ధతి ఇది. ఇందులో భాగంగా ఎక్కువ మందికి తెలిసిన ఒక పద్ధతి కండోమ్ (condom) ని ఉపయోగించడం. ఇది చాలా సులువుగా లభిస్తుంది. ఉపయోగించడం కూడా చాలా సులువు కాబట్టి దీన్ని ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కేవలం అవాంఛిత గర్భం (unwanted pregnancy) రాకుండా మాత్రమే కాదు.. వివిధ రకాల సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుంచి రక్షణ కల్పించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. అయితే కండోమ్ కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఉపయోగించిన తర్వాత సెక్స్ జీవితం లో కాస్త బోర్ కొట్టేస్తుంది. అప్పుడు కొత్త పద్ధతిని ఉపయోగించాలని అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఉపయోగించేందుకు ఎలాంటి బర్త్ కంట్రోల్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం రండి..
1. వజైనల్ రింగ్
వజైనల్ రింగ్ అనేది ఓ ఫ్లెక్సిబుల్ రింగ్. ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఉపయోగించడం కూడా సులువు. దీని ద్వారా అవాంఛిత గర్భం రాకుండా చూసుకోవడం చాలా సులువు. ఇది మన శరీరంలో విడుదలైన అండాలను గర్భాశయం వద్దకు చేరకుండా చేస్తుంది. ఇది యోని భాగంలో అమర్చుకొని మూడు వారాల పాటు ఉంచుకోవచ్చు. ఈ మూడు వారాల పాటు ఇది బర్త్ కంట్రోల్ పద్ధతిగా పనిచేస్తుంది. మీ పిరియడ్స్ ఎప్పుడు వస్తాయో గుర్తించి అప్పుడు దీన్ని తీసేయాల్సి ఉంటుంది. తిరిగి పిరియడ్స్ పూర్తి కాగానే దీన్ని తిరిగి ధరించవచ్చు.
2. బర్త్ కంట్రోల్ పిల్స్
అవాంఛిత గర్భం రాకుండా చేసే ఈ తరహా పద్ధతి గురించి కూడా చాలామంది కి తెలుసు. అయితే వీటిని ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేంటంటారా? ఈ తరహా మందులను రోజూ ఒకే సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది. పిరియడ్ పూర్తయ్యాక ఆరో రోజు నుంచి ప్రారంభించే ఈ మందులను ఇరవై ఒక్క రోజుల పాటు వేసుకొని ఆపేయడం వల్ల ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో పిరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో అండం విడుదలను, ఫలదీకరణను ఇది అడ్డుకుంటుంది.
3. ఇంట్రా యుటిరైన్ డివైజ్ (ఐయూడీ)
ఇంట్రా యూటిరైన్ డివైజ్ అంటే మీ గర్భాశయంలో అమర్చే ఓ చిన్న టి షేప్ లో ఉండే వస్తువు. దీన్నే సాధారణ భాషలో కాపర్ టి అని కూడా పిలుస్తారు. దీన్ని వైద్యులు మీ గర్భాశయంలో అమరుస్తారు. ఇది గర్భాశయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది శుక్రకణాలు అండాలను కలిసి ఫలదీకరణం చెందకుండా ఆపుతుంది. అలా అవాంఛిత గర్భం నివారిస్తుంది. దీన్ని ఒక్కసారి మీ గర్భాశయంలో ప్రవేశపెడితే ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఉపయోగించవచ్చు. దీనివల్ల పిరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది. రక్తస్రావం కూడా తగ్గుతుంది.
4. బర్త్ కంట్రోల్ ప్యాచెస్
రోజూ మందులు వేసుకోవడం మర్చిపోయే వారు ఈ తరహా ప్యాచెస్ ని ఉపయోగించడం వల్ల బర్త్ కంట్రోల్ పద్ధతిని సజావుగా సాగించవచ్చు. దీన్ని వారానికోసారి అతికించుకోవాల్సి ఉంటుంది. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ హార్మోన్ల ను కంట్రోల్ చేస్తుంది. అవాంఛిత గర్భం రాకుండా కాపాడుతుంది. దీన్ని అతికించుకోవడం తీసేయడం కూడా చాలా సులువు.
5. కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్స్
ఈ బర్త్ కంట్రోల్ పద్ధతి కాంట్రాసెప్టివ్ పిల్స్ లా పనిచేస్తుంది. అయితే మందుల రూపంలో కాకుండా ఇంజెక్షన్ రూపంలో వాటిని అందించడం జరుగుతుంది. ఒక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత దాని ఫలితం 150 రోజుల వరకూ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. చాలా రోజుల పాటు దీని ఫలితం ఉంటుంది. కేవలం ఆ ఇంజెక్షన్ తీసుకున్న తేదీని క్యాలెండర్ లో నోట్ చేసుకొని ఆ సమయం పూర్తయ్యే నాటికి మళ్లీ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది.
ఇవన్నీ అవాంఛిత గర్భం రాకుండా చూసుకునే సాధారణ పద్ధతులు.. అయితే కొత్త పద్ధతి ఏది ప్రారంభించాలన్నా సరే.. ముందు అది మీకు నప్పుతుందా? దాని వల్ల మీ శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు రావచ్చు వంటి విషయాలన్నింటినీ డాక్టర్ ని సంప్రదించి మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.